Thursday, March 5, 2015

నేటి మహిళల సమస్యలకు పరిష్కారం (Women's Problems & solutions)

నేటి మహిళల సమస్యలకు పరిష్కారం
(Women's Problems & solutions)
మార్చి  ఎనిమిదవ తేదీ  వస్తోందంటే ,స్త్రీలలో ఒక రకమైన  హల్చల్ ,భయంతో కూడిన సంతోషం ,ఏదో చేశామనే తృప్తి , ఇంకా ఏదో చేయలేదనే ఆందోళన ,భవిష్యత్తులో ఏమి చేయగలమనే ఆశ , ఇన్ని రకాలైన భావోద్వేగాలకు లోనవడం సహజం . ఏ స్త్రీ అయినా , ఆమె శక్తిమేరకు ,తన పరిధిలో కృషి చేయడానికి వెనకాడదు . కాని , తాను ఉహించినట్లు ,లేదా ఆశించినట్లు అన్ని విషయాలలో చేయగలుగుతోందా  అనుకుంటే పొరపాటే . మరి ఎందుకు ఇలా జరుగుతోంది ?
అందుకు కారణాలు విశ్లేషిద్దాం .
స్త్రీకి పుట్టక ముందునుంచే సమస్యలు , అవి అందరికి తెలిసినవే . భ్రునహత్య -:ఆడపిల్ల వద్దని ,తల్లి, తండ్రి వత్తిడితో నే
కడుపులో పడిన బిడ్డకి గోరి కట్టేస్తుంది . ఆ బీజం భర్త వలననెకద. బయటకు ఆ మాట చెప్పలేదు . స్వయం గా నిర్ణయం తీసుకుంటే , ఆమె కుటుంబ జీవితం నాశనమే .
ఎదిగే వయసు-: అక్కడ అమ్మాయికి అన్ని ఆంక్షలే . స్కూలుకి వెల్లనిస్తే , అక్కడి సమస్యలు . సర్కారి బడులలో నే
ఆడపిల్లల్ని చదివిస్తారు . అక్కడ తగిన సదుపాయాలు ఉండవు . స్కూలు దూరమైతే ,పంపించడానికి వెనకాడుతారు .
తనకన్నా చిన్న పిల్లలు ఉంటే , వాళ్ళని ఎత్తుకుని ఆడించాలి . అందుకు స్కూలు మానేయాలి . పెద్ద మనిషయితే ,చదివింది చాలు , అని పెండ్లి చేయాలనీ చూస్తారు . బాల్య వివాహం చేసుకుని ఆ పిల్ల పడే  సమస్యలు ఎన్నో ,చెప్పలేము .
ఒక వేళ తల్లి తండ్రులు బాగా చదివించినా , లేక ఆ పిల్లకి ఉన్న ఆశయాలను ,సాధించడానికి , తోడ్పడినా , అక్కడ కూడా అడుగడుగునా ఆమెకు అడ్డు తగలడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి . ఆటలలో ,ఉద్యోగాలలో , పరిశ్రమలలో, వ్యాపారాలలో ఒక స్త్రీ ఉన్నత స్థితికి రావాలంటే ఉండే  అడ్డంకులు , లైంగిక వేధింపులు ,చెప్పరానివి .
వివాహం -: పెండ్లి అనేది తల్లి తండ్రులు ఆడపిల్ల బాధ్యతని వదిలించు కోడానికి,సామాజిక నిబంధనలకు లోబడి జరిపే
ప్రయత్నం . పెద్దలు కుదిర్చే పెండ్లి తో ఆడపిల్ల సామజిక బంధనాలకు లోబడి పోవలసి వస్తుంది . వారి పరువు పోతుందని ,భర్త అత్తవారింట ఏ పోరు పెట్టిన ,సహించి భరిస్తుంది అమ్మాయి . భర్త కొడితే తప్పులేదు, అతడే మల్లి తిండి పెట్టి భరిస్తాడు అనే ఆడవాళ్లు , మనలో దాదాపు 45 శాతం ఉన్నారు . పైగా ‘ఇంటి గుట్టు’ ఎవరికీ చెప్పరాదు . మన ఆడవాళ్లే నవ్వుతారు. హేళన చేస్తారు . అందరికి చెబుతారు.
ఆమె అత్తవారింటి అగచాట్లు భరించలేకపోతే ,పోలిసుకి చెప్పిన,వాళ్ళు అవహేళన చేస్తారు , అక్కడ సరి అయిన న్యాయం జరగదు. కోర్టుకి వెడితే తీర్పు రావడానికి ఏళ్ళు పడతాయి .. పిల్లలుంటే వాళ్ళ పోషణ కష్టం అవుతుంది .
పెండ్లి అయి, పిల్లలు వెంటనే కలిగితే , ఆమె ఉద్యోగం చేసే వీలు ఉండదు . విడాకులకు వచ్చాక , ఎ కారణం చేత  నైనా ,
ఒడంబడి తిగి భార్య, భర్త కలిసి జీవించినా , తిరిగి కొద్ది రోజులకే కోట్లాడుకుని , విడిపోయే జంటలెన్నో . కోర్టు దాకా  వెళ్ళారని దేప్పుకుంటారు . వీరి ఇద్దరి మధ్య పిల్లల క్షోభ  వర్ణించ రానిది . వారి జీవితాలు అంధకార బంధురం అవుతాయి . వారి చదువు, పెంపకం తెగిన గాలి పటాలు అవుతాయి .
స్త్రీల ఉద్యోగాలు-:స్త్రీకి ఇంటి పనితోపాటు ఏదో ఒక సంపాదన ఉంది తీరాలి అన్నది తొంభై శాతం మహిళలకు తప్పనిసరి
అలాగని ఇంట్లో గృహిణిగా గడుపుతున్న స్త్రీలను , భర్తలు గౌరవిస్తున్నారా అంటే అదీ కొంతవరకే . కడు బీద మహిళలకు పని చేయక థప్పదు. భర్త సంపాదన సగం తాగుడు, అతడి చెడు అలవాట్లకు పోగా , ఇంట్లో పిల్లలకు , తనకు, ఆభర్తకు , చుట్టాలకు, పోషణ జరపడం ఆమె బాధ్యత . మధ్య తరగతి కుటుంబీకులకు , ఇన్నిటి తోపాటు , సామజిక మర్యాదలు,పిల్లల చదువులు , పెండ్లిళ్ళు ఖర్చులు భరించలి. అందుకే చదువుకున్న స్త్రీలు తప్పనిసరిగా ఏదో ఒక జాబ్ , ఒక వ్యాపకం తో సంపాదించి కుటుంబానికి ఖర్చు పెడతారు. అయిన ఈ స్త్రీలలో చాలా మందికి , ఇంటి పనులలో భర్త తోడ్పాటు ఉన్దదు. మగ మహారాజు పని చేయద్దని , చిన్నప్పుదినుండే తల్లి, చెప్పుతుంది . తను కూడా తన భర్తకు అలా చేసి ఉండడం ఒక  కారణం . ఇరుగు పొరుగులు చూస్తారని ఆంక్షలు . పైగా ఆమె జీతం కూడా అతడే తీసుకుని అజమాయిషీ చేస్తారు. డబ్బు ఉన్నవాళ్ళ ఇళ్ళలో భార్య భర్తల మధ్య సరిఅయిన అవగాహన  లేక , అహంకారంతో ,డబ్బు మూలాన విచ్చల విడితనం , ఎవరి ఇష్టం అయినట్లు వారు చేస్తూ ,కుటుంబ వ్యవస్థ పడిపోతుంది అనేక కుటుంబాలలో .
ఇంటి పరిస్థితి  ఇలా వుంటే, ఉద్యోగంలో , పై అధికారులు ,సహోద్యోగులతో ,కార్య నిర్వహణ లో అనేక సమస్యలు ఎదుర్కుంటారు మహిళలు . జీత భత్యాలు సమానంగా  ఇవ్వక పోవడం, పనిలో తప్పలు ఎంచి హేళన చేయడం,
పదోన్నతి ఇవ్వకుండా జరపడం, లైంగిక హింసకు పాల్పడడం , లేటుగా పని చేయించడం,దూరంగా బదిలీలు చేయడం
ఇలా ఎన్నో సవాళ్ళను ఎదుర్కుంటూ పని చేయాల్సి వస్తుంది . అందుకే ఎంతోమంది స్త్రీలు కొన్నిరోజులు చేసి ఉద్యోగం మాని వేస్తారు . వారు తిరిగి, పరాదినలుగా బ్రతకవలసి వస్తుంది .
స్త్రీల ఆరోగ్య సమస్యలు -:పుట్టినప్పటినుండి చనిపోయేదాకా ప్రతి మనిషికి ఆరోగ్య సమస్యలు ఉన్న , పురుషులకంటే, స్త్రీలకే ఎక్కువ అనారోగ్యం ఏర్పడుతుంది . శారీరకంగా స్త్రీ బలహీనం , రజస్వల అయినప్పటినుండి అవి పోయేదాకా ప్రతి నెల ఆమె రక్తహీనత తో బాధ పడుతుంది . పిల్లలు పుట్టినపుడు, పుట్టాక, వారి పెంపకం లో, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటుంది . భర్తతో లైంగిక సంబంధాలలో పరస్పర తృప్తి పొందలేక పోవడానికి అనేక కారణాలు . కుటుంబంలో వృద్దులైన అత్తమామలకు , అవసరమైతేతల్లితంద్రులకు సేవలు చేయడం ఆమె బాధ్యత.
వృద్ధాప్యం లో సమస్యలు -: భర్త తోడు నీడగా ఉండి, ఆమె కష్ట  సుఖాలకు అండగా ఉన్నంత కాలం , స్త్రీకి బాగానే ఉన్తున్ది. ఓర్పుతో కలం గడుపు తుంది కానీ ,కష్టపెట్టే భర్త తో జీవితం పంచుకున్న స్త్రీకి నరకమె. అయిన పిల్లల క్షేమం కొరకు ఓర్పుతో జీవితం గడుపుతుంది . వృద్దాప్యం వచ్చాక , భర్త ఉన్న, చేయలేని స్థితి . పిల్లలు దగ్గర లేక , తోడు లేని స్త్రీ ఎన్ని అవస్థలొ పడుతుంది .
ప్రతి స్త్రీ ఇన్ని రకాలైన దశలలో , మహిళలకే పరిమితమైన ఎన్నో సమస్యలను ఎదుర్కుంటున్నారని చరిత్ర చెపుతోంది ఏ దేశం వెళ్ళిన స్త్రీల సమస్యలు దాదాపు ఒకటే .సామాజికమైన, మత సంబంధ మైన ,కుటుంబపరమైన సమస్యలు ప్రతి స్త్రీకి ప్రత్యేకంగా ఉంటాయి . ఒక కుమార్తెగా , ఒక భార్యగా , ఒక తల్లిగా , చెల్లిగా , అక్కగా, ఒదినగా ,అత్తగా , ఇలాగ ఎన్నో అవతారాలు లో ఆమె సత్సంబంధాలు నెలకొల్పుకొని , జీవించడం , ఆమెకు వెన్నతో  పెట్టిన విద్య. అయినా  అడుగడుగునా ఆమె వేధింపులకు గురి అవుతూనే ఉన్నది అందుకు  పరిష్కారం ఏమిటి?
 1. చదువు-: విద్య ఆమెకి భూషణం . జీవితమంతా రక్షణ కల్పిస్తుంది . స్వయంగా నిర్ణయాలు తీసుకో గలుగు తుంది . శక్తి  నిస్తుంది . ఉపాధిని చూపుతుంది . ఉన్నత స్థాయి చేరుస్తుంది . విచక్షణ జ్ఞానాన్ని కలగ జేస్తుంది.
 2. గుణ శీలాలు -: ఆమె ఆభరణాలు . నిజాయితీ , నిర్మొహమాటం ,మంచి నడవడి, సచ్చిలత ,మానవీయ విలువలు ఆమెకు రక్ష.
 3. సమయ స్పూర్తి -: చాక చక్యము తో పనులు నెరవేర్చు నైపుణ్యము ఉండాలి .
 4. ఆరోగ్యం -: ఆహార్యం , ఆరోగ్యం , పైన లక్ష్యము . అందుకు కరాటే, యోగా ,స్వయం రక్షణ
 5. స్త్రీలతో పరస్పర సంబంధాలు -:సామాజికంగా , ఇరుగు పొరుగు, పెద్దలతో పరస్పర సహాయ సహకారాలు అందించుకోవాలి . ఒక నెట్ వర్కింగ్ ఏర్పరచుకోవాలి . అయితే అవి పరిమితంగా ఉండాలి .
 6. సామజిక సేవ -:ప్రతి స్త్రీ కొంచెం సమయం , తనకు ఇష్టమైన రంగం లో సామజిక సేవ చెయ్యాలి .
 7. విద్యావంతులైన మహిళలు ఒకొక్కరు పదిమంది స్త్రీలకు చదువు చెప్పాలి .
 8. యువత పై నిఘా-:కుటుంబాలలోని యువత తప్పు మార్గాలు పడుతున్నపుడు వారిని సరి దిద్దే ది స్త్రీలే .
 9. ఇరుగు పొరుగు కుటుంబాలలో అలజడులు జరిగిన, భార్య భర్తలు కలహించు కున్నా , స్త్రీలు అందరు ఒక గులాబీ దండుగా మారి , వారి వైరాన్ని సమసిపోయేల చూడాలి ,
 10. పత్రికలు ,మీడియా -:అవసరమైనప్పుడు,, మామూలుగా కూడా స్త్రీల సమస్యలపైన పత్రికలు ,నడిపి చదివించాలి . మీడియాలో స్త్రీ సమస్యలపైన , చర్చలు పరిష్కారాలను సూచించాలి .
 11. చట్టాలపై అవగాహన -:ప్రతి స్త్రీ, తన దేశపు చట్టాలపైన అవగాహన కలిగేట్లు సమాచారం తెలుసుకోవాలి .
 12. ప్రభుత్వం లో స్త్రీల సమస్యలకు పరిష్కారం చూపని నాయకులకు తగిన బుద్ధి చెప్పాలి .


     డాక్టర్ హేమలతా దేవి  ఆచంట